శ్రీ హనుమాన్​ చాలీసా తాత్పర్యము | Shri Hanuman Chalisa With Telugu Meaning

శ్రీ హనుమాన్​ చాలీసా

దోహా

శ్రీగురుచరణ సరోజరజ, నిజమనముకుర సుధారి ।
వరణౌ రఘువర విమల యశ, జో దాయక ఫలచారి ॥

తాత్పర్యము

శ్రీ గురుదేవుల పాదపద్మాల పవిత్ర ధూళితో నా మనస్సు అనే అద్దాన్ని చక్కగా కడిగి ధర్మార్థకామమోక్షాలనే నాలుగు ఫలాలను ఇవ్వగల శ్రీరామచంద్రుని నిర్మల యశస్సును వర్ణించటానికి ప్రయత్నించుతాను.

దోహా

బుద్ధిహీన తను జానికే, సుమిరౌఁ పవన కుమార్​ ।
బలబుద్ధి విద్యా దేహు మోహి, హరహు కలేశ వికార్​ ॥

తాత్పర్యము

నా బుద్ధిహీనతను గుర్తించి ఆంజనేయుని స్మరిస్తున్నాను. ఓ పవనపుత్రా! నాకు శక్తిని, బుద్ధిని, విద్యను ప్రసాదించు; నా దోషాలను, వికారాలను తొలగించు.

పరసత్యమనే వృక్షంపై రాములు, కృష్ణులు, బుద్ధులు, క్రీస్తులు అనే ఫల గుత్తులెన్నో వేలాడుచున్నాయి. అడపాదడపా, వీటిలో ఒకటో రెండో ఈ భూమిపై అవతారాలుగా ఆవిర్భవించి జనులలో అధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతపరుస్తాయి.

దోహా

జయ హనుమాన జ్ఞాన గుణసాగర ।

జయ కపీశ తిహుఁలోక ఉజాగర ॥1॥

తాత్పర్యము

జ్ఞాన సద్గుణ సాగరమైనటువంటి ఓ హనుమన్మూర్తీ! ముల్లోకాలకు జ్ఞానకాంతి నిచ్చే కపీశ్వరా! జయము! జయము! చేపలు దూరంగా ఉండవచ్చు; కాని రుచికరమైన ఎఱను నీళ్ళలో వేసినప్పుడు, అవన్నీ అన్నివైపులనుండీ వస్తాయి. అలానే శ్రద్ధాభక్తులు నిండిన హృదయం గల పవిత్ర భక్తుని దగ్గరకు భగవంతుడు సత్వరం వస్తాడు.

దోహా

రామదూత అతులిత బలధామా ।

అంజనిపుత్ర పవనసుత నామా ॥2॥

తాత్పర్యము

శ్రీరామునికి దూత అయినవాడా! సాటిలేని బలానికి నిలయమైనవాడా! అంజనాదేవి కుమారా! వాయుదేవుని పుత్రా! ఏది మనిషిని నిలువరించి, పనిచేయిస్తుంది? బలం. బలమే మంచితనం. దౌర్బల్యమే పాపం. ఉపనిషత్తులలో నుంచి ‘బాంబు’ లా వచ్చిపడే పదం ఏదైనా ఉన్నదంటే, అది నిర్భీతి… అభీః.

దోహా

మహావీర విక్రమ బజరంగీ ।

కుమతి నివార సుమతి కే సంగీ ॥3॥

తాత్పర్యము

మహావీరా! పరాక్రమధీరా! వజ్రంలాంటి సుదృఢ దేహం గలవాడా! దుర్బుద్ధిని నశింపచేస్తూ, సద్బుద్ధిని పెంపొందించేవాడా! ఇదో గొప్ప సత్యం: బలమే జీవితం; దౌర్బల్యమే మరణం. బలమే ఆనందం, శాశ్వతజీవనం, అమృతత్వం; దౌర్బల్యమే మరణం.

దోహా

కంచన వరణ విరాజ సువేశా ।

కానన కుండల కుంచిత కేశా ॥4॥

తాత్పర్యము

బంగారు కాంతుల మేనిచ్ఛాయవాడా! అతిసుందర వేషధారణం గలవాడా! చెవులకు కుండలాలు ధరించినవాడా! అందంగా ముడిచిన కేశాలు గలవాడా! సన్న్యాసి ధరించే కాషాయవస్త్రాలు పవిత్ర ఆలోచనలను సహజంగానే మనస్సులో సృష్టిస్తాయి. వస్త్రాలకు వాటంతటవాటికే ఏ ప్రత్యేకతా లేకపోయినా, అవి సంజ్ఞాపూర్వక సందేశాన్ని అందిస్తాయి

దోహా

హాథ వజ్ర ఔధ్వజా విరాజై ।

కాంధే మూంజ జనేమా సాజై ॥5॥

తాత్పర్యము

చేత వస్త్రం, ధ్వజం కలిగి విరాజిల్లుతున్నవాడా! భుజస్కంధాల్లో మౌంజి, జందెములతో ప్రకాశిస్తున్నవాడా!

అనేకుల గౌరవ మన్ననలను, విధేయతను చూరగొన్న వ్యక్తిలో ఇతరులకన్నా దైవీశక్తి అధికతరంగా వ్యక్తమౌవుతూ ఉంటుంది.

దోహా

శంకర సువన కేసరీ నందన ।

తేజ ప్రతాప మహాజగవందన ॥6॥

తాత్పర్యము

రుద్ర వీర్యోద్భవ రుద్రమూర్తీ! కేసరీతనయుడైన హనుమంతా! గొప్ప తేజో ప్రతాపాలున్నవాడా! లోకంచేత పూజింపబడేవాడా!

ప్రకృతి శోభిస్తూన్నప్పుడు, ఆ శోభ దేనిమీద ఆధారపడి ఉంటుంది? భగవంతుని మీద; సూర్య చంద్ర నక్షత్రాలమీద కాదు. ఎక్కడైనా ఏదైనా ప్రకాశిస్తూంటే– సూర్యుని ప్రకాశమైనా, మన చైతన్య ప్రకాశమైనా– అదంతా భగవంతుడే. భగవంతుడు ప్రకాశిస్తూంటే, అన్నీ ప్రకాశిస్తూంటాయి.

దోహా

విద్యావాన గుణీ అతి చాతుర ।

రామకాజ కరివేకో ఆతుర ॥7॥

తాత్పర్యము

విద్యావంతుడా, సద్గుణవంతుడా! బహుచాతుర్యం గలవాడా! రామకార్య నిర్వహణలో సతతం ఆతురత చూపేవాడా!

ఈ యుగంలో భక్తి లేని కర్మ ఆధారంలేనిది. అది ఇసుక మీద పునాది వేసినట్లు. మొదట భక్తిని సంపాదించండి. మిగాతావన్నీ – పాఠశాలలు, వైద్యశాలలు మొదలైనవి – అన్నీ మీకు కావాలనుకొంటే, చేర్చబడతాయి.

దోహా

ప్రభుచరిత్ర సునివేకో రసియా ।

రామలఖన సీతా మన బసియా ॥8॥

తాత్పర్యము

శ్రీరామచంద్రప్రభువు చరితాన్ని వినటంలో రసికత్వం గలవాడా! శ్రీ సీతారామ లక్ష్మణులను హృదయసీమలో ప్రతిష్ఠించుకొన్నవాడా!

మనోవాక్కాయాలతో భగవంతుని పూజించటమే భక్తి. ‘కాయంతో’ అంటే హస్తాలతో పూజించడం, సేవించడం, పుణ్య తీర్థయాత్రలకు కాలినడకనపోవడం, భగవన్నామ సంకీర్తనాన్ని చెవులతో వినడం, భగవన్మూర్తిని కళ్ళతో అవలోకించడం! ‘మనస్సుతో’ అంటే నిరంతరం ధ్యానించడం, భగవల్లీలనుగుర్తించుకొని, వాటి మీద ఆలోచిస్తూండటం. భగవత్​స్తోత్ర పఠనం భగవన్నామ సంకీర్తనం – ఇవి వాక్కుతోభగవంతుని పూజించడం.

దోహా

సూక్ష్మ రూపధరి సియహిఁదిఖావా ।

వికట రూప ధరి లంక జరావా ॥9॥

తాత్పర్యము

సూక్ష్మరూపంతో సీతామాతకు కనిపించావు. వికటరూపం దాల్చి లంకను దహించావు.

భగవంతుడు సంకల్పిస్తే, ఏనుగును కూడా సూదిబెజ్జం గుండా పంపించగలడు. ఆయనకు ఇచ్ఛ వచ్చినట్లు చేయగలడు.

దోహా

భీమరూపధరి అసుర సంహారే ।

రామచంద్రకే కాజ సఁవారే ॥10॥

తాత్పర్యము

భీకరాకారం దాల్చి రాక్షసులను సంహరించావు. రామకార్యాన్ని నిర్వర్తించావు.

భగవదవతారం అంటే మానవరూపంలో అభివ్యక్తమైన భగవత్తత్త్వం. అతడు చక్రవర్తికి వైస్రాయ్​ లాంటివాడు. ఏదైనా దూరప్రాంతంలో అల్లర్లు జరిగితే, రాజు తన వైస్రాయ్​ని పంపినట్లు; ధర్మపరిరక్షణార్థం భగవంతుడు తన అవతారాన్ని పంపుతాడు.

Leave a Comment

Scroll to Top